హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూ-రోట్లింజన్ విశ్వవిద్యాలయ ఎంవోయూ పత్రాలను బయటపెట్టాలని హైదరాబాద్ జేఎన్టీయూలోని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఒప్పదానికీ, వంగపండు నాగరాజుకూ సంబంధమేమిటని వర్సిటీ అధికారులను విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం జేఎన్టీయూ విద్యార్థి సంఘం నేతలు వర్సిటీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. ఎంవోయూల విషయంలో వస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని, ఎంవోయూ పత్రాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందంపై అనేక ప్రశ్నలొస్తున్నాయని, రోట్లింజన్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా చెప్పుకుంటున్న గణపతి అనే వ్యక్తి పేరుతో వీడియోలు, లేఖలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
వంగపండు నాగరాజు వంటి బయటిశక్తుల ప్రమేయంతో విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలుచేయడం పట్ల అనుమానాలున్నాయని పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో థర్డ్ పార్టీ ఏజెన్సీ అవసరమేమిటని, ఈ ఏజెన్సీ ద్వారా అడ్మిషన్లు చేపట్టడమేమిటని ప్రశ్నించారు. వంగపండు నాగరాజు పాత్రపై విమర్శలొస్తున్నా యూనివర్సిటీ అధికారులు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. కోర్సుల్లో చేరిన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నదని పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో పారదర్శకతను నిర్ధారించేందుకు వర్సిటీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, పూర్తి విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నిరసన కార్యక్రమంలో విద్యార్థి సంఘం నేతలు జవ్వాజి దిలీప్, అంబటి తేజ, బీ అశోక్, ఎస్ కరుణాకర్‌రెడ్డి, జగన్, భానుప్రకాశ్, రాహుల్, సాగర్, జయరాం తదితరులు పాల్గొన్నారు.