హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కాలేజీలలో చదువుతున్న విద్యార్థుల ట్రాన్స్ఫర్కు సోమవారం జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి అనుమతులు మంజూరు చేశారు. నిబంధనలను అన్ని కాలేజీ యాజమాన్యాలు అమలు చేయాలని ఆదేశించారు. ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి, ఒక యూనివర్సిటీ నుంచి మరో యూనివర్సిటీకి, అటానమస్ కాలేజీ నుంచి నాన్ అటానమస్ కాలేజీకి, ఇలా రకరకాల పద్ధతిలో విద్యార్థుల ట్రాన్స్ఫర్కు అవకాశం ఇచ్చారు.
స్టూడెంట్ ట్రాన్స్ఫర్లు అనేక కారణాలతో ముడిపడి ఉంటాయి. అందులో ప్రధానంగా ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అయ్యేలా వెసులుబాటును కల్పించింది. దీనికి సంబధించిన ఫీజు, తదితర వివరాలు జేఎన్టీయూ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్టు యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.