Telangana Decade Celebrations | సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అన్ని ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో నిర్వహించాలని శుక్రవారం జేఎన్టీయూ హైదరాబాద్ ఆదేశాలు జారీ చేసింది. ఆయా కళాశాలల విద్యార్థులు, అధ్యాపకుల సహకారంతో ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆయా కాలేజీ యాజమాన్యాలకు /ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా కళాశాలల్లో కవిత పోటీలు, వ్యాసరచన పోటీలు వంటి పలు రకాల కార్యక్రమాలను జేఎన్టీయూ హైదరాబాద్ నిర్ణయించింది. ప్రభుత్వ పథకాలు రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మీ/షాదీముబాకర్, మిషిన్ భగీరథ, మిషన్ కాకతీయ, కేసీఆర్ కిట్స్, దళితబంధు, కంటి వెలుగు, ఆసరా పెన్షన్లు తదితర పథకాలపై తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో కవితల పోటీలు నిర్వహించాలని కళాశాలలకు స్పష్టం చేసింది.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్ణయించిన కొన్ని మార్గదర్శకాలను జేఎన్టీయూ హైదరాబాద్ విడుదల చేసింది. ఈ పథకాలపై కవితల పోటీల నిర్వహణకు ఈ నెల 17 వరకు గడువు విధించారు. ఈ మేరకు ఈ నెల 19న వ్యాస రచన పోటీలు ఫలితాలు విడుదల చేస్తారు. జూన్ 20న కవితల పోటీలలో పాల్గొన్న వారికి జేఎన్టీయూ హైదరాబాద్ ఆడిటోరియంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. పోటీల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలు కాలేజీల యాజమాన్యాలు లేదా ప్రిన్సిపాళ్లు తెలియచేస్తారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాల పైనా వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించాలని జేఎన్టీయూ హైదరాబాద్ ఆయా కళాశాలల యాజమాన్యాలను జేఎన్టీయూ హైదరాబాద్ ఆదేశించింది. వ్యాసరచన పోటీలు కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. కవితల పోటీలు, వ్యాసరచన పోటీలు, బహుమతులు మార్గదర్శకాల పూర్తి వివరాల కోసం జేఎన్టీయూ హైదరాబాద్ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.