Double Bedroom Houses | కార్వాన్, సెప్టెంబర్ 27: జియాగూడలోని డబుల్ బెడ్రూం ఇండ్లను స్థానికేతరులకు కేటాయించవద్దంటూ ఆ ప్రాంతవాసులు ఆందోళనకు దిగారు. దీంతో జియాగూడలోని డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద శుక్రవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అయితే పోలీసులు, రెవెన్యూ అధికారులు వారికి నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతల్లో భాగంగా జుమ్మేరాత్ బజార్ ఉప్పలమ్మ ఆలయం సమీపంలో నివసిస్తున్న 16 కుటుంబాలను నోటీసులిచ్చి ఖాళీ చేయించారు. వారికి జియాగూడలోని డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించారు.
దీంతో వారంతా శుక్రవారం రాత్రి తమ సామాన్లతో జియాగూడకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ కలెక్టర్, ఆసిఫ్‌నగర్ తహసీల్దార్ జ్యోతి, స్థానిక కార్పొరేటర్ దర్శన్ అక్కడికి చేరుకున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లను తమ ప్రాంతం వారికే కేటాయించాలంటూ గత నాలుగేండ్లుగా ప్రభుత్వంతో పోరాడుతున్నామని, ఇప్పుడు అకస్మాత్తుగా బయటివారికి ఎలా కేటాయిస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగారు.
తమ ప్రాంతంలో కూడా సర్వే చేస్తున్నారని ఇక్కడ ఇండ్లు కోల్పోయేవారికి ఇక్కడే కేటాయించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఖాళీగా ఉన్న ఇండ్లను జియాగూడలోని పేద ప్రజలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు మాట్లాడుతూ.. కేవలం 16 మందికే పట్టాలు ఇచ్చామని, ఇకముందు స్థానికులకే ప్రాధాన్యం ఇస్తామని తెలపడంతో సమస్య సద్దుమణిగింది. ఈ పట్టాలు అందుకున్న 16 మందిలో 11 కుటుంబాలు మాత్రమే డబుల్ బెడ్రూం ఇండ్లలోకి ప్రవేశించాయి. మిగతా ఐదు కుటుంబాలవారు సరైన పత్రాలు తేలకపోవడంతో వారికి కొంత సమయమిచ్చారు.