హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగ నియామకాల్లో అత్యంత ప్రతిభావంతులైన అభ్యర్థులనే ఎంపికచేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లకు సూచించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రాజ్యాంగ విలువలను కాపాడాలని గవర్నర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ‘పబ్లిక్ సర్వీస్ కమిషన్లు-న్యాయ చిక్కులు’ అనే అంశంపై నల్సార్ వర్సిటీలో నిర్వహించిన వర్క్‌షాప్ ముగింపు వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. ప్రతిభావంతులను ఎంపికచేసే బాధ్యతలను నిర్వహించడంలో ఎక్కడా రాజీపడొద్దని సూచించారు. నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని పేర్కొన్నారు. వర్క్‌షాప్‌లో తెలంగాణ, కర్ణాటక, గోవా, గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు బుర్రా వెంకటేశం, శివశంకరప్ప ఎస్ సాహుకర్, ఉదయ్‌సింగ్ ఎస్ రౌరానే, హస్ముఖ్ పటేల్, యూపీఎస్సీ జాయింట్ సెక్రటరీ సంతోష్ గోపాల్ అజ్మీరా, టీజీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ తదితరులు పాల్గొన్నారు.