హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : నార్త్ ఈస్ట్ కనెక్ట్ అసోసియేషన్(ఎన్ఈసీఏ)తో తెలంగాణ బంధం మరింత బలోపేతం కానున్నదని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌లో ‘నార్త్ ఈస్ట్ కనెక్ట్-2025’ ముగింపు కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ నార్త్ ఈస్ట్ కమ్యూనిటీకి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వారధిగా ఎన్ఈసీఏ పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నార్త్ ఈస్ట్ కనెక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రిటైర్డ్ ఐఏఎస్ పాపారావు బియ్యాల, ఉపాధ్యక్షుడు రిటైర్డ్ డీజీపీ గౌతమ్ సావంగ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్ సహారియా, ప్రొఫెసర్ అజైలియూ న్యూమై, స్టీఫెన్ సన్, డాక్టర్ కే రాజేశ్వరరావు, శ్రీధర్ ముప్పిడి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను జర్మనీ దేశ అధికార సోషల్ డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధుల బృందం శుక్రవారం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా స్పీకర్ జర్మనీ ప్రతినిధులను శాలువాలతో సత్కరించారు. అనంతరం 2014లో ఏర్పడిన శాసనసభ, శాసనమండలి వ్యవస్థల పనితీరును జర్మనీ ప్రతినిధి బృందానికి వివరించారు. శాసనసభకు 119 మంది, శాసనమండలికి 40 మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నదని, పెట్టుబడులకు రాష్ట్రం ఎంతో అనుకూలంగా ఉన్నదని వివరించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో ఎస్డీపీ సెక్రటరీ జనరల్ సబీనా ఫెండరీచ్, ఆసియా-పసిఫిక్ హెడ్ మైక్రో గుంథర్, ఇండియా డైరెక్టర్ క్రిస్టోఫ్ పీ మోర్ ఉన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ నరసింహాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.