హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం అమలుచేయలేకపోతున్నదని, ప్రస్తుతం కేసీఆర్ పథకాలనే కొనసాగిస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతానికి రైతుభరోసా, రైతుబీమాతోపాటు మరికొన్ని పథకాలు అమలు చేస్తున్నామని, త్వరలోనే మరిన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పారు. గత సర్కారులో ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అద్భుతమని కొనియాడారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. వ్యవసాయంతోపాటు పండ్ల తోటలకూ నీటిఎద్దడి ఏర్పడినట్టు చెప్పారు. మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ‘ఫోర్ ఫ్రంట్’ కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ ముందుండి నడిపించారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.