BRS | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గ్రామ గ్రామాన తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రచారం హోరెత్తుతున్నది. ఔరంగాబాద్‌లోని జబిందా మైదానంలో ఈ నెల 24న బీఆర్ఎస్ బహిరంగసభ తలపెట్టిన నేపథ్యంలో తెలంగాణ పథకాలకు ఊరూరా విస్తృత ప్రచారం లభిస్తున్నది. పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు ప్రచార రథాల వాల్‌పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో దిగ్విజయంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలని ప్రజలు కోరుతున్నారని జీవన్‌రెడ్డి చెప్పారు.
ఔరంగాబాద్‌లో ఈ నెల 24న బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగసభ ఏర్పాట్లను పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, ఐడీసీ చైర్మన్ సముద్రాల వేణుగోపాలాచారి, టీఎస్ఐఐడీ కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం, మహారాష్ట్ర షేత్కరీ సంఘటన యువజన విభాగం అధ్యక్షుడు సుధీర్ సుధాకర్‌రావు బిందు తదితరులు బహిరంగసభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఔరంగాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలు, తాలూకా, గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.