హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ ఒక విజనరీ అని, జైలుకెళ్లి చిప్పకూడు తిన్న రేవంత్‌రెడ్డి ఒక ప్రిజనరీ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక, పోలీస్, హింసాత్మక రౌడీ పాలన సాగిస్తున్నదని కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులుచెరిగారు. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు బాలరాజు యాదవ్, బొమ్మెర రామమూర్తి, కిషన్‌రావుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర సాధకుడు కేసీఆర్ నివాసంపై స్వయంగా ముఖ్యమంత్రే తన పార్టీ శ్రేణులను ఉసిగొల్పి దాడి చేయించారని, గతంలో గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట క్యాంపు కార్యాలయాలపై కూడా ఇలాగే దాడులకు పాల్పడ్డారని జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌ను రాజకీయ కక్షతో తాకాలని చూస్తే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని తేల్చిచెప్పారు. కేసీఆర్ ఒక హైవోల్టేజ్ కరెంటు లాంటి వారని, ఆయన్ను ముట్టుకుంటే రేవంత్ సరార్ భస్మం కావడం ఖాయమని హెచ్చరించారు.
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, వేధింపులే ఎజెండాగా రేవంత్ సరార్ పనిచేస్తున్నదని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. సైఫాబాద్ పీఎస్‌లో కేటీఆర్ పీఏ, పీఆర్వోలను విచారణ పేరిట వేధించడమే కాకుండా, ముసుగులు ధరించిన రౌడీ మూకలతో దాడి చేయించడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు కొమ్ముకాస్తున్న పోలీసు అధికారులు భవిష్యత్తులో చంచల్‌గూడ జైలుపాలు కావడం ఖాయమని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు బల్మూరి వెంకట్ వంటి వారు బలుపుతో దళితుల పేరును వాడుకుంటూ దాడులకు పిలుపునివ్వడం దారుణమని, దళితులేమైనా కాంగ్రెస్‌కు బానిసలా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అంబేదర్ రాజ్యాంగానికి బదులు రేవంత్ రాజ్యాంగం నడుస్తున్నదని, కేసీఆర్ పాటలు పెడుతున్నారనే కక్షతో గణేశ్ మండపాల వద్ద డీజేలకు కూడా అనుమతులు నిరాకరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్న బీఆర్ఎస్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక 30వేల మంది బూత్ ఏజెంట్లకు నోటీసులు ఇప్పిస్తూ అక్రమాలకు తెగబడుతున్నారని ఆయన ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి తెలంగాణకు పట్టిన శని అని, రాష్ట్రానికి ఆయనే చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని జీవన్‌రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజల ఆదరణతో రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావడం తథ్యమని జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ ఖేల్ ఖతం కానున్నదని పేర్కొన్నారు. అధికార మదంతో జరిపిస్తున్న దాడులకు 60 లక్షల గులాబీ సైన్యంతో బీఆర్ఎస్ ప్రతిదాడులకు దిగక తప్పదని ఆయన హెచ్చరించారు.