సమర్కండ్: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో మరోసారి డబుల్ ధమాకా మోగించేందుకు భారత గ్రాండ్‌మాస్టర్లు సిద్ధమయ్యారు. రెండేండ్ల కిందట బుడాపెస్ట్‌లో స్వర్ణాలు గెలిచి చరిత్ర సృష్టించిన పురుషుల, మహిళల జట్లు బుధవారం మొదలయ్యే తాజా ఎడిషన్‌లో డిఫెండింగ్ చాంపియన్ల హోదాలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాయి. ఓపెన్ విభాగంలో తెలంగాణ కుర్రాడు ఇరిగేశి అర్జున్, వరల్డ్ చాంప్ డి.గుకేశ్, ఫామ్‌లో ఉన్న ఆర్.ప్రజ్ఞానందతో పాటు విదిత్ గుజరాతి, నిహాల్ సరిన్ తమ స్వర్ణాన్ని కాపాడుకోవడంపై కన్నేశారు.
టాప్ సీడ్ అమెరికా, ఆతిథ్య ఉజ్బెకిస్థాన్ జట్ల నుంచి రెండో సీడ్ భారత్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. మహిళల విభాగంలో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక, తానియా సచ్దేవ్ దూరమైనప్పటికీ, దిగ్గజ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి జట్టును ముందుండి నడిపిస్తోంది. ఆమెతో పాటు వరల్డ్ కప్ విజేత దివ్య దేశ్‌ముఖ్, ప్రపంచ చాంపియన్ చాలెంజర్ ఆర్.వైశాలి, వంతిక అగర్వాల్, సవితా శ్రీతో కూడిన భారత దళం మహిళల విభాగంలో టాప్ సీడ్‌గా నిలిచింది. కజకిస్థాన్, జార్జియా జట్లు అమ్మాయిలకు సవాలు విసిరే అవకాశం ఉంది.