జగిత్యాల, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం బాటలో తెలంగాణ నడిచిందని మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్లోకి ఆహ్వానించేందుకు జీవన్‌రెడ్డి స్వగృహానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం వచ్చిన సందర్భంగా మాట్లాడారు. ఆత్మగౌరవ సమస్య, ప్రజాహిత నిర్లక్ష్యంతోనే కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్ల పాలన అట్టర్‌ఫ్లాప్ అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రసాధకుడు కేసీఆర్ నేతృత్వంలో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌తో తనకు 45 ఏండ్ల స్నేహం, అనుబంధం ఉన్నదని పేర్కొన్నారు. త్వరలోనే కేసీఆర్‌ను కలుస్తానని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలిందని స్పష్టంచేశారు.
కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రస్తుతం కనిపించకుండా పోయాయని తెలిపారు. పార్టీలో వలసవాదులను ప్రోత్సహిస్తూ, తనలాంటి నికార్సైన కార్యకర్తలకు అన్యాయం చేయడం సరికాదని పేర్కొన్నారు. రెండున్నరేండ్ల పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంచేశారు. కేసీఆర్ పాలననే రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, ఆయనతోనే రాష్ట్రం వచ్చిందనే విషయం ఎవరూ విస్మరించలేరని చెప్పారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారన్న సమాచారంతో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గురువారం సందడి వాతావరణం నెలకొన్నది.
ఇటు బీఆర్ఎస్ శ్రేణులు, అటు జీవన్‌రెడ్డి అనుచరులు, అభిమానుల్లో ఉత్సాహం కనిపించింది. గురువారం ఉదయం వరకే జగిత్యాల వీధులన్నీ కేటీఆర్‌కు స్వాగతం పలుకుతున్న ఫ్లెక్సీలతో నిండిపోయాయి. జీవన్‌రెడ్డి ఇంటికి అరకిలోమీటర్ దూరం జనసందోహంతో నిండిపోయింది. సరిగ్గా మూడున్నర గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్‌రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీమంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి, గణేశ్ గుప్తా, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్, పలువురు నాయకులతో కలిసి జీవన్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు.
కేటీఆర్ రాకతో ఒక్కసారిగా జనసందోహం కేరింతలు కొట్టింది. ‘సీఎం.. సీఎం..’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి స్వయంగా కేటీఆర్‌కు ఎదురువెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కేటీఆర్ సైతం జీవన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి, ఆలింగనం చేసుకొని తన ఆనందాన్ని వ్యక్తంచేశారు. కేటీఆర్‌ను, జీవన్‌రెడ్డిని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, పుష్పగుచ్ఛాలు అందించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు పోటీ పడటంతో పర్యటన ఆలస్యం కావడానికి కారణమైంది.