హైదరాబాద్, జూన్ 29: మెంటల్ సీఎం చంద్రబాబు, రెంటల్ సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో నడుస్తున్న పచ్చ మీడియా కంపు తెలంగాణకు తలవంపుగా మారిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (Jeevan Reddy) మండిపడ్డారు. ఎల్లో మీడియా తెలంగాణలో తిష్టవేసి జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తూ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, కేసీఆర్ ఫ్యామిలీ ప్రతిష్ఠను మసకబార్చేల బ్లేమ్ గేమ్ ఆడుతున్నదని ధ్వజమెత్తారు. ఆంధ్రా పత్రికలు, టీవీలు కేసీఆర్ ఫ్యామిలీని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్‌గా చేసుకొని
విషపు రాతలు రాస్తున్నాయని, తప్పుడు కథనాలు చూపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎల్లో మీడియా గోబెల్స్ గేమ్ షోకు రేవంత్, చంద్రబాబులే స్పాన్సర్స్ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విధ్వంసానికి రేవంత్ రెడ్డి, చంద్రబాబు జాయింట్ ఆపరేషన్‌కు తెరదీశారని, పచ్చ మీడియా, బీజేపీలు కూడా ఈ కుట్రలో భాగస్వాములేనని నిప్పులు చెరిగారు.
రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లో ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియా దుష్ప్రచారం సాగిస్తోందని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దగుల్బాజీ చానల్లో కేటీఆర్ పై ప్రసారం చేస్తున్న నీఛమైన కట్టుకథలను అన్నం తినే ఎవరైనా జర్నలిజం అంటారా? అని ఆయన నిలదీశారు. కేటీఆర్ ప్రతిష్టను దెబ్బ తీసేలా, వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా ఎల్లో మీడియా అబద్ధాలు వండి వారుస్తున్నదన్నారు. ఇలాంటి జుగుప్సాకరమైన కథనాల వెనుక ఉండి అన్నం పెడుతూ పురిటి గడ్డకే సున్నం పెడుతున్న కాంగ్రెస్ రాక్షస సంతతి గురించి తెలంగాణ ప్రజలకు అంతా తెలుసని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటుకు నోటు కేసు బాస్ చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకోవడానికి తెలంగాణకు భస్మాసుర హస్తం, ఆంధ్రాకు అభయ హస్తం అందిస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరంపై నిందలు మోపుతూ వేసిన కమీషన్, హైదరాబాద్‌కు విశ్వఖ్యాతి తెచ్చిన ఈ–ఫార్ములా కారు రేస్‌పై ఏసీబీ విచారణ, ఫోన్ ట్యాపింగ్ పేరుతో సిట్ దర్యాప్తు వంటివన్నీ రేవంత్ రెడ్డి, చంద్రబాబుల డైరెక్షన్లో రూపుదిద్దుకున్న తెలంగాణ వ్యతిరేక కుట్రలో భాగమేనని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గోతి కాడి గుంటనక్క కాంగ్రెస్ జిత్తులమారి రాజకీయం ఇక సాగదన్నారు. బీఆర్ఎస్ ఉద్యమశక్తిని చూపెడతామని, పడిపోతున్న తెలంగాణను మళ్లీ నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీ జోలికొస్తే తెలంగాణ రాష్ట్ర పొలిమేరలు దాటిపోయేలా తరిమికొడతామని జీవన్ రెడ్డి హెచ్చరించారు.