జగిత్యాల, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ)/జగిత్యాల అర్బన్/రాయికల్ : యావత్ తెలంగాణ జగిత్యాల వైపే చూస్తున్నదని, జగిత్యాల నుంచే కేసీఆర్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి స్పష్టంచేశారు. దేవుడు తనకు శక్తిని ఇచ్చాడని, మరో మూడేండ్లపాటు పోరాటం చేసి జగిత్యాల గడ్డ పై బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని, కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఇన్ని రోజులు ఇక్కడి ప్రజలు తన కష్టసుఖాల్లో తోడున్నారని, ఇప్పుడు కూడా అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు. జగిత్యాలలో జరిగే కేసీఆర్ సభకు కార్యకర్తలు, అనుచరులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. 20న జగిత్యా ల వేదికగా కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్న సందర్భంగా ఆయన, తన అనుచరులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ వొద్దినేని హరిచరణ్‌రావు ఇంట్లో సన్నిహితులతో సమావేశమయ్యారు. అనంతరం రా యికల్లోని పద్మశాలీ సేవా సంఘం కల్యాణ మండపంలో కార్యకర్తలు, నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయాచోట్లా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కేవలం కేసీఆర్‌తోనే సాధ్యం అవుతుందని, ఆయనే మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో ఉండి ప్రజా సేవ చేయలేనప్పుడు నాలుగున్నర దశాబ్దాలుగా ఉన్న ఆ పార్టీని వీడి, తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కేటీఆర్ పనిగట్టుకుని ఇంటికి వచ్చి బొట్టుపెట్టి.. ‘నాన్న గుర్తుకు చేస్తుండు. మీ లాంటి వారు పార్టీలోకి రావాలని కోరిండు’ అని చెప్పారని అన్నారు. కేసీఆర్ తనకు దగ్గరి మిత్రుడే, ఆయనతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రం కోసం ఇద్దరం కలిసి పనిచేయాలని ఆ దేవుడే నిర్ణయించినట్టు పేర్కొన్నారు. తన భవిష్యత్తు ఇక్కడి ప్రజల చేతుల్లోనే ఉన్నదని, ఇంటి ఆడబిడ్డలంతా తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత పదేండ్లలో తెలంగాణను దేశంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. వివిధ కారణాల రీత్యా మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగిపోయినట్టు తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు మేడిగడ్డను పునరుద్ధరించాలని ఆదేశాలిచ్చినా, రేవంత్ సర్కార్ కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందని, ఆయన్ను దోషి గా చూపాలనే మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టలేదని విమర్శించారు.
రేవంత్‌ది ఐరన్‌లెగ్
కాంగ్రెస్‌లోకి రేవంత్ ఉడుం సొచ్చినట్టు సొచ్చిండని, ఆయనది ఐరన్‌లెగ్ అని విమర్శించారు. రేవంత్ అచ్చుడచ్చుడే గీత గీసుకు ని, ఎవరిని ఎలా తొక్కాలి? ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కాలి? అనే ధ్యాస తప్ప, రాహుల్‌ను ప్రధానిని చేయాలన్న తపన లేదని అన్నారు. రాహుల్ కాలికి బలపం కట్టుకుని అటు కర్ణాటక, ఇటు తెలంగాణలో ఊరూవాడ తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. ఇక్కడి వారు మాత్రం రాహుల్‌గాంధీని బలిచేశారని ఆరోపించారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత పాల్గొన్నారు.