హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్‌కు ఈ సారి రికార్డుస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది జేఈఈ మెయిన్-1కు హాజరయ్యేందుకు 14.5లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిరుడు 13.11 మంది దరఖాస్తు చేసుకోగా, ఈ సారి 1.4లక్షల మంది అధికంగా దరఖాస్తులు సమర్పించారు. జేఈఈ మెయిన్ -1 దరఖాస్తుల గడువు నవంబర్ 27తో ముగిసింది.
జనవరి 21 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జేఈఈకి దరఖాస్తు చేసే వారి సంఖ్య పెరుగుతుండటంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కొత్త పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ సారి తెలంగాణలో కొత్తగా ఆదిలాబాద్, పెద్దపల్లి, కోదాడలో పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఎన్టీఏ వెల్లడించింది.