హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీల్లోని బీటెక్, బీ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2025 రిజిస్ట్రేషన్ నవంబర్ నుంచి మొదలుకానుంది. జనవరి చివరివారంలో జేఈఈ మెయిన్-1 పరీక్ష, ఏప్రిల్ మొదటి వారంలో జేఈఈ మెయిన్-2 పరీక్షలను నిర్వహించే అవకాశాలున్నాయి.
పూర్తి షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వారం పదిరోజుల్లో విడుదల చేయనుంది. నవంబర్ నుంచే మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. నిరుడు జేఈఈ మెయిన్ సిలబస్లో పలు మార్పులు చేశారు. దీంతో ఈ ఏడాది ఎలాంటి మార్పులుండకపోవచ్చు. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ను 300 మార్కులకు మూడు గంటలపాటు నిర్వహిస్తారు.