హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): కొత్తగా ఏర్పాటుచేసిన మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్‌గా హెచ్ఎండీఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా పలువురు ఐఏఎస్, నాన్ క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
జీహెచ్ఎంసీని మూడుగా విభజించిన ప్రభుత్వం.. కొత్తగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లను ఏర్పాటు చేసింది. వీటికి ప్రత్యేకంగా కమిషనర్లను నియమించిన ప్రభుత్వం వారిపై ప్రత్యేక అధికారిని నియమించింది.
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌ను కొనసాగించింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్‌గా జీ శ్రీజన, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా టీ వినయ్‌కృష్ణారెడ్డిని నియమించింది. ఇటీవల అత్యంత వివాదాస్పదంగా మారి వార్తల్లో నిలిచిన సింగరేణి సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ప్రభుత్వ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్‌ను నియమించింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఓఎస్డీ రఘురామ్శర్మను పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. దీంతోపాటు మంత్రి శ్రీధర్‌బాబు ఓఎస్డీగా అదనపు బాధ్యతలను అప్పగించింది.
