హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): పేద, మధ్యతరగతి వాళ్లు ఎఫ్టీఎల్, బఫర్జోన్ల గురించి తెలియక డబ్బులు పెట్టి ఇండ్లు కట్టుకొని, వాటికి పన్నులు కడుతుంటే.. ఆ పేదల ఇండ్లను కూల్చడమే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యంగా పెట్టుకోవద్దని లోక్‌సత్తా పార్టీ నేత జయప్రకాశ్ నారాయణ సూచించారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన హైడ్రా దూకుడు, హైదరాబాద్‌లో రోడ్లు, ట్రాఫిక్ అధ్వాన పరిస్థితులు, మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై స్పందించారు. ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పేరిట ప్రభుత్వం ఇండ్లు కూల్చడానికి, వాటిలో ఉన్నవారిని తరలించడానికి ఓ ప్రణాళిక, దానికిముందు ఒక సమగ్ర సర్వే అవసరమని చెప్పారు. సమాజ హితానికి నష్టమైతే కచ్చితంగా ఇండ్లు తొలగించాలని, అంతకంటే ముందు వారికి ప్రత్యామ్నాయం చూపించాలని అన్నారు. లేదా వీలైనంత వరకూ రెగ్యులరైజ్ చేయాలని సూచించారు. ప్రజా సంక్షేమం దెబ్బతినకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
గతంలో తాను కూకట్‌పల్లిలో ఉన్నప్పుడు కొందరు ఓ నాలాను ఆక్రమిస్తే.. వారిపై కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్టు జయప్రకాశ్ నారాయణ చెప్పారు. అప్పటివరకూ ఉప్పు, నిప్పులా ఉన్న నాయకులు ఈ విషయంలో కలిసిపోయి ఆ అధికారిని బదిలీ చేయించారని చెప్పారు. ఇలా రాజకీయ, అధికార యంత్రాంగాలు అప్పుడు చేసిన తప్పులు చాలానే ఉన్నాయని అన్నారు. కాబట్టి.. ప్రస్తుత ప్రభుత్వం కూడా కొన్ని చోట్ల ఆచితూచి వ్యవహరించాలని కోరారు. ఒక గీత గీశాను కాబట్టి.. వాళ్లందరనీ కూలగొడతాం అంటే కుదరదని చెప్పారు. ‘అధికారులే లేఅవుట్లు వేశారు, వారే అప్రూవల్ ఇచ్చారు, వారే రిజిస్టర్ చేశారు, లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీలు కట్టించారు. ఉన్నపళంగా ఇండ్లు తొలిగిస్తామంటూ వస్తే ప్రజల్లో కచ్చితంగా వ్యతిరేకత వస్తుంది’ అని అన్నారు. అందుకే అధికారులు ఇట్లాంటి విషయాల్లో లంచాలు తీసుకోకుండా పనులు చేయాలని చెప్పారు.
రాష్ట్రంలో ఈ మధ్య విద్యుత్తు సరిగా ఉండటం లేదని, పారిశుధ్య లోపం కారణంగా దోమలు స్వైర విహారం చేస్తున్నాయని జయప్రకాశ్ నారాయణ ఆరోపించారు. హైదరాబాద్‌లో నేడు ప్రతి ఇంటిలో ఓ చికున్ గున్యా, డెంగీ బాధితుడు ఉన్నాడని చెప్పారు. ఒక డాక్టర్ రోజుకు పది కేసులు చూస్తున్నాడని, అధికారిక లెక్కల్లో వాటిని చూపకపోవడం దారుణమని అన్నారు. హైదరాబాద్‌లో రోడ్లను తక్షణం బాగు చేయాలన్నారు. ట్రాఫిక్ చాలా అధ్వానంగా, అస్తవ్యస్తంగా మారిందని, వాటిని తక్షణం సరిదిద్దే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పారు. తెలుగు రాష్ర్టాల్లో విద్య, వైద్యంపై పెట్టే ఖర్చుకు జవాబుదారీతనం ఉండాలని అన్నారు. మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నాయకత్వ బాధ్యతల్లో ఉన్నవారు ఒక్కోసారి సామాన్యులను చూసి నేర్చుకోవాలని, ఇంగితజ్ఞానంతో మాట్లాడాలని అన్నారు. ప్రతి వ్యక్తికి ప్రైవసీకి ఉంటుందని, దాన్ని గౌరవించాలని చెప్పారు.