Jangaon | యూపీ అయోధ్యలోని సరయూ నదిలో జనగామకు చెందిన యువతి గల్లంతయ్యింది. కేంద్రానికి చెందిన తాళ్లపల్లి నాగరాజు, అతని సోదరుడి కుటుంబానికి చెందిన 15 మంది రెండురోజుల కిందట అయోధ్యకు వెళ్లింది. రామ మందిరంతో సహా స్థానిక ఆలయాలను సందర్శించారు. సోమవారం ఉదయం 8 గంటలకు నదీ స్మానం చేసేందుకు సరయూ నదిలో లక్ష్మణ్ ఘాట్‌కు వెళ్లారు. అయితే, భారీ వర్షాల నేపథ్యంలో పై నుంచి ఒక్కసారిగా వరద నీటిని వదలడంతో ఘాట్‌పై వరకు వరద ఉప్పొంగింది. దాంతో ఒక్కసారిగా ఐదుగురు నీటిలోపడిపోయారు.
ఇందులో నలుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఇందులో తేజస్విని అనే యువతి మాత్రం వరద నీటిలో కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు బాలిక ఆచూకీ దొరకలేదని కుటుంబీకులు వాపోయారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లగా.. యూపీ అధికారులతో మాట్లాడినా ఫలితం లేకుండాపోయింది. బాలిక ఆచూకీ కోసం కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలిక జాడ కోసం లక్ష్మణ్ ఘాట్ వద్దే పడిగాపులు పడుతున్నారు. తేజస్విని స్థానిక ఏబీవీ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నది.