హైదరాబాద్, జనవరి 20(నమస్తే తెలంగాణ): సింగరేణి బొగ్గు టెండర్లలో మైనస్‌గా ఉండాల్సిన టెండర్లను ఎక్సెస్‌గా వేయడం కొత్తగా ఉన్నదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. రెండేండ్లుగా ఇదే బాగోతం నడుస్తున్నదని విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. బొగ్గు కుంభకోణంపై వాస్తవాలు బయటపెట్టి, నైనీ టెండర్ల మాదిరిగానే మిగిలిన బొగ్గు టెండర్లను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేసినందునే హరీశ్‌రావుపై ప్రభుత్వం కక్ష గట్టిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బావమరిదే ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఈ విషయంలో ఏమైనా సంబంధం ఉన్నదా? అనే అనుమానం వ్యక్తంచేశారు. హరీశ్‌రావు ప్రశ్నలకు సర్కార్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదని తెలిపారు. దండుపాళ్యం ముఠా నుంచి సింగరేణిని కాపాడాలని కిషన్‌రెడ్డిని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే విద్యాసాగర్ పాల్గొన్నారు.