హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): దేవాదుల మూడో ఫేజ్ పంపులను ప్రారంభించాలని జనగామ బీఆర్ఎస్ ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన కృషి ఫలించింది. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా తపాస్‌పల్లి, గండిరామారం, బొమ్మకూరు, కన్నెబోయినగూడెం, వెల్దండ, లద్నూర్ రిజర్వాయర్లను నింపి నియోజకవర్గంలోని ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పలుమార్లు ప్రభుత్వాన్ని కోరా రు.
జనగామ నియోజకవర్గంలోని దేవాదుల పరిధిలోని 50% ఆయకట్టులోని పంటలు పూర్తిగా ఎండిపోయాయి. పల్లా మంత్రి, అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. నెల రోజుల నుంచి ప్రభుత్వం పంపులను రన్ చేయలేదు. దీంతో అసెంబ్లీ వేదికగా పల్లా సమస్యను లేవనెత్తారు. బీఆర్ఎస్ కృషి, ఎమ్మెల్యే పల్లా ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం బుధవారం నుంచి దేవన్నపేట నుంచి ధర్మసాగర్‌కు వచ్చే మూడో ఫేజ్ పంపులను ఆన్ చేయాలని నిర్ణయించింది.