హైదరాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ): ప్రముఖ శతాధిక చిత్రాల నేపథ్య గాయని ఎస్. జానకి మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి, తీవ్ర కలతకు గురిచేసిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేరొన్నారు. జానకి మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జానకికి సిరిసిల్లతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. జానకి తన బాల్యానికి సంబంధించిన కొన్ని అమూల్యమైన సంవత్సరాలను తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోనే గడిపారని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. ఆ ప్రాంతంతో ఆమెకు ఉన్న అనుబంధం సిరిసిల్ల ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. నవరసాల గాన కోకిల తన మధురమైన అమృత గాత్రంతో నవరసాలను అద్భుతంగా పలికించగల అరుదైన లెజండరీ గాయని ఎస్. జానకి అని అన్నారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు వివిధ భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడుతూ, ఆమె కోట్లాది మంది భారతీయులను తన గానంతో మంత్రముగ్ధులను చేశారని కొనియాడారు. జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని, భారతీయ చలనచిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా సంగీత ప్రపంచానికి ఎన్నటికీ పూరించలేని తీరని లోటని అన్నారు. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా, ఆమె పాడిన అమర గీతాలు ఎప్పటికీ మనల్ని అలరిస్తూనే ఉంటాయన్నారు.
ప్రజల గుండెల్లో పదిలం
తన మధురమైన గళంతో దశాబ్దాల పాటు కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన జానకి అమ్మగారు ఇక లేరనే వార్త యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటు. మా నాన్నగారి చిత్రాలతో పాటు నా చిత్రాల్లోనూ ఆమె పాడిన ఎన్నో అమర గీతాలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతాయి. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా -బాలకృష్ణ.
మీ స్వరం అమరం
‘నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మగారి మధురగాత్రం ఉంది. ఈ పాటలు వినిపించిన ప్రతిసారీ ఆ రోజులు, జ్ఞాపకాలు కళ్లముందు సజీవంగా కదలాడుతాయి. జానకమ్మగారు ఒక గాయని మాత్రమే కాదు. భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె గానం ఎన్నో తరాలను స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంలా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది. ఆమె కుటుంబ సభ్యులకు, కోట్లాది సంగీత సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. జానకమ్మగారు మీ స్వరం ఎప్పటికీ అమరం’ – చిరంజీవి