స్టేషన్‌ఘన్‌పూర్, ఏప్రిల్ 6 : మూడెకరాల్లో సాగు చేసినా రైతు భరోసా అందలేదని రైతులు నిరసనకు దిగారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడంకు చెందిన రైతులు కాసు లింగయ్య, లింగనబోయిన కుమార్, బొంకూరి సోమయ్య, కత్తుల సంపత్, మూడెకరాల్లోపు పంట సాగు చేస్తే ఎకరం వరకే రైతు భరోసా అందించారని, మిగతా భూమికి ఇవ్వలేదంటూ ఆదివారం స్థానిక పంచాయతీ ఎదుట నిరసన వ్యక్తంచేశారు. మూడెకరాల వరకు సాగు చేసిన 72 మందికి రైతుభరోసా అందలేదని తెలిపారు.
652 సర్వే నంబర్లో సాగు చేసుకుంటున్న రైతులకు పాసుబుక్‌లు ఉన్నాయని, గత బీఆర్ఎస్ పాలనలో రైతుబీమా వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా అందించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.