హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కేటాయించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గోదావరిలో నికర జలాల వాటాను కూడా తేల్చాలని కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి పాటిల్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం ప్రత్యేకంగా కలిశారు. కృష్ణా, గోదావరి నదీజలాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎకువగా ఉన్నప్పటికీ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పక్షపాతంగా వ్యవహరిస్తున్నదని, ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం, తెలంగాణకు 34 శాతం నీటి కేటాయింపులు చేసిందని కేంద్రమంత్రికి వివరించినట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది సైతం ఏపీ తమకు కేటాయించిన మొత్తానికి మించి నీటిని తరలించుకుపోయిందని, ఇకనైనా మళ్లింపును అడ్డుకోవాలని, అందుకు టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతలు, సమ్మక సాగర్ బరాజ్‌లకు అనుమతులు ఇప్పించాలని కేంద్రమంత్రిని కోరామని వెల్లడించారు. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఏపీ సర్కారు గోదావరి-బనకచర్ల అనుసంధాన పథకానికి రూపకల్పన చేసిందని ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. గోదావరిలో తెలంగాణకు సంబంధించి నికరజలాల వాటాను తేల్చాలని, లేదంటే ఆయకట్టు స్థిరీకరణ పేరుతో నష్టపోతామని వివరించినట్టు తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)తోపాటు పలు పథకాల కింద ఆర్థికసాయం చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. తుమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని, ముంపునకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించాలని కోరినట్టు వెల్లడించారు. సమావేశంలో ఎంపీ రఘువీర్‌రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, నీటి పారుదలశాఖ ఈఎన్సీ (ఓఅండ్ఎం) విజయ్ భాసర్‌రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ్ ఈజ్ ది రైట్ పర్సన్!
హీ ఈజ్ ది రైట్ పర్సన్’ అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీ పర్యనలో భాగంగా కేంద్ర మంత్రి పాటిల్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అక్కడున్న ఇంగ్లిష్ మీడియా ప్రతినిధులు కేంద్ర మంత్రితో జరిగిన భేటీపై మాట్లాడాల్సిందిగా రేవంత్‌రెడ్డిని కోరారు. ఇందుకు నిరాకరించిన రేవంత్‌రెడ్డి.. ‘హీ ఈజ్ ది రైట్ పర్సన్’ అంటూ ఉత్తమ్ వైపు చూపించారు. దీంతో భేటీపై మంత్రి ఉత్తమ్ మీడియాకు వివరించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కేంద్ర మంత్రితో జరిగిన విషయాలను వెల్లడించకుండా మంత్రితో చెప్పిచడం ఏమిటన్న ప్రశ్నలు వినిపించాయి.