హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టాల డిమాండ్లు తీర్చడం ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదని కేంద్రం చేతులెత్తేసింది. గోదావరి-కావేరి అనుసంధాన (జీసీ లింక్) ప్రాజెక్టుపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది. రివర్ లింకింగ్‌లో భాగమైన అన్ని రాష్ర్టాలతో ఈ నెలాఖరులో ఓ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపింది. జీసీ రివర్ లింక్ ప్రాజెక్టుపై నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) మంగళవారం ఢిల్లీ నుంచి హైబ్రిడ్మోడ్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఛత్తీస్‌గఢ్ మినహా ప్రాజెక్టులో భాగమైన అన్ని రాష్ర్టాల అధికారులు హాజరయ్యారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర కొత్త ప్రతిపాదనలను తీసుకొచ్చాయి. కర్ణాటక తాగునీటి అవసరాలకు జీసీ లింకింగ్‌లో ఇదివరకే 16 టీఎంసీలను కేటాయించారు.
తాజాగా ఆ రాష్ట్రం తమ సాగు అవసరాలకూ నీటిని కేటాయించాలని ప్రతిపాదించగా.. వైతరణి, దమనగంగ, గోదావరి లింక్ చేపట్టాలని మహారాష్ట్ర డిమాండ్ చేసింది. ఏపీ సైతం ఇచ్చంపల్లి నుంచి జీసీ అనుసంధానాన్ని పకనపెట్టాలని, పోలవరం నుంచి పెన్నా రీజియన్ ద్వారా కావేరి లింక్‌ను చేపట్టాలని పాతపాటనే పాడింది. జీసీ అనుసంధానంతో అందుబాటులో ఉండే 148 టీఎంసీల జలాల్లో వాటాగా 74 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ అధికారులు తేల్చిచెప్పారు. 83 మీటర్ల ఎగువ నుంచే నీటిని తీసుకోవాలని, తకువ ఎత్తు నుంచి నీటిని తరలించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. సమ్మకసాగర్, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులకు 152 టీఎంసీల జలాలను కేటాయించాలని, నదుల అనుసంధానంలో భాగంగా 20 టీఎంసీల చొప్పున 40 టీఎంసీల సామర్థ్యంతో 2 రిజర్వాయర్లను నిర్మించి ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రాలు తమ ఇష్టం వచ్చినట్టు వాటాలు అడిగితే నీళ్లు ఎకడి నుంచి వస్తాయని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి మహంతి అసహనం వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్నదే 148 టీఎంసీలని, రాష్ట్రాల డిమాండ్లను తీర్చాలంటే 400 టీఎంసీలైనా సరిపోవని పేర్కొన్నారు. ఈ నెలాఖరున సమావేశాన్ని నిర్వహించి జీసీ అనుసంధానంపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.