ఖైరతాబాద్, ఫిబ్రవరి 3: కాంగ్రెస్ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉన్నదని, అది కులగణనతో నేడు స్పష్టమైందని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం వారు మీడియాతో మాట్లాడారు. సమగ్ర కులగణన పేరుతో రేవంత్‌రెడ్డి సర్కారు ఏడాదికాలంగా డ్రామా ఆడిందని విమర్శించారు. బీసీ కులగణన పేరుతో ఓసీల కులగణన చేపట్టిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభాను తక్కువ చేసి అగ్రకులాలను ఎక్కువ చేసి చూపించేందుకే దీనిని ఉపయోగించుకున్నారని మండిపడ్డారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కులగణన వివరాల పేరుతో కాకమ్మ, పిట్ట, కట్టుకథలు చెప్పారని ధ్వజమెత్తారు. దీనిలో నూరుశాతం కుట్ర జరిగిందని విమర్శించారు. కులగణన సమగ్రంగా, సంపూర్ణంగా, శాస్త్రీయంగా జరగలేదని స్పష్టంచేశారు. బీసీలను సామాజికంగా, రాజకీయంగా, అణచివేసి అగ్రకులాల పాలనను మరో వందేండ్లు పెంచడానికి జరిగిన కుట్రలో భాగమే ఈ అశాస్త్రీమైన కులగణన అని పేర్కొన్నారు. బీసీలకు నిజంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేనేలేదని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బీసీ మేధావులతో కమిటీ వేసి కులగణన వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రకటన నేపథ్యంలో మంగళవారం బీసీలు ఫూలే, అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, సర్వే రిపోర్టులను చెత్తబుట్టలో వేయాలని పిలుపునిచ్చారు. 5న బీసీ మేథావులు, ఉద్యోగ, ప్రజాసంఘాలతో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు.
స్థానిక సంస్థలకు 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎలా ప్రకటిస్తారని జాజుల శ్రీనివాస్‌గౌడ్, చిరంజీవులు ప్రశ్నించారు. ఆయన ఏమైనా చీఫ్ ఎలక్షన్ ఆఫీసరా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం బీసీల కాళ్లు పట్టుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. బీసీ సమాజాన్నే బొందపెట్టాలని చూస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. అలాంటి కాంగ్రెస్‌ను వదిలిపెట్టేది లేదని, ఆ పార్టీకి వ్యతిరేకంగా మహోద్యమం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ సంఘాల నాయకులు బాలగోని బాలరాజుగౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాడూరి శ్రీనివాస్, తాటికొండ విక్రమ్‌గౌడ్, బండి సాయన్న, ఏ వేణుకుమార్, దుర్గయ్యగౌడ్, రఘురాం నేత, పిడికిలి రాజు, జాజుల లింగంగౌడ్, మాదేశి రాజేందర్, లావణ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తప్పుల తడుకగా రూపొందించిన కులగణన సర్వే నివేదికను మంగళవారం చెత్తబుట్టలో వేసి నిరసన తెలుపుతామని జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి 2021 వరకు బీసీల జనాభా తగ్గిందని పేర్కొనడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకునేందుకే అగ్రకులాల జనాభాను పెరిగినట్టుగా చూపుతున్నారని ఆరోపించారు. బలహీనవర్గాలను దగా చేసిన కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.