హైదరాబాద్, అక్టోబరు 14 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ తన భాషను మార్చుకుంటే మంచిదని, బీసీ, ఎస్సీ, ఎస్టీలను కించపర్చేలా మాట్లాడితే ఊరుకునేది లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. అగ్రకులాలు, సామాజిక వర్గానికి చెందిన వారు పార్టీ మారితే చడిచప్పుడు చేయని ఆయన, బీసీల విషయంలో అందుకు విరుద్ధంగా మాట్లాడటం ఏమిటని ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
పొన్నాలపై ఆయన చేసిన వ్యాఖ్యలను బీసీలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నామని చెప్పారు. గతంలో బీసీ కులాలను వృత్తుల పేరుతో కించపరిచారని, నిన్నగాక మొన్న మందకృష్ణ మాదిగపై చిల్లరగా మాట్లాడరని, నేడు పొన్నాలను ఘోరంగా అవమానించి రాజీనామాలు చేసేలా చేశారని పేర్కొన్నారు. రాహుల్ బీసీల గురించి సానుకూలంగా మాట్లాడుతుంటే, గల్లీలో రేవంత్ అవమానిస్తున్నారని, రేవంత్ వైఖరి కాంగ్రెస్ పార్టీకే నష్టమని ఆయన చెప్పారు.