హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి, బీసీ నేత శ్రీనివాస్ గౌడ్‌పై అక్రమ కేసు నమోదుకు టీటీడీ బోర్డు యోచిస్తున్నట్టు తెలుస్తున్నదని, అలా జరిగితే సహించేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనంలో విషయంలో తెలంగాణ ప్రజలపై టీడీపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని మాజీ మంత్రి వ్యా ఖ్యానించాడని చెబుతూ కేసు పెట్టాలనుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడతామనడం సమంజసం కాదని, టీటీడీ బోర్డు తన ఆలోచనను విరమించుకోవాలని తెలిపారు. శ్రీవారి దర్శనం అనంతరం చాలామంది తెలంగాణకు చెందిన అగ్రకుల ప్రజాప్రతినిధులు సైతం ఏపీ సీఎం చంద్రబాబుపై మాట్లాడారని, అప్పుడు ఎలాంటి కేసులు పెట్టని టీటీడీ బోర్డు, కేవలం బీసీ నేత అయిన శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు పెట్టాలని యో చించడం వివక్ష కాదా? అని ఆయన ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడితే వివరణ కోరే అవకాశం, మళ్లీ భవిష్యత్తులో మాట్లాడకుండా షరతు విధించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా రాజకీయ కో ణంలో కేసు నమోదు చేయాలని చూ స్తే సహించబోమని హెచ్చరించారు.