ఖైరతాబాద్, డిసెంబర్ 16: కాంగ్రెస్ ప్రభుత్వం గీత వృత్తిపై కక్షగట్టిందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘ఏడాది కాంగ్రెస్ పాలన.. కల్లు గీత వృత్తి’పై సమావేశం నిర్వహించారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌడలకు, కల్లు గీత వృత్తిదారులకు చేసిందేమీ లేదని పేర్కొన్నారు. బీసీలకు ఇవ్వాల్సిన ఎక్సైజ్ శాఖను వేరేవారికి ఇచ్చి వృత్తిదారులపై అధికారులను ఉసిగొల్పి అక్రమంగా అరెస్టు చేయించి జైలులో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే త్వరలో వేలాది మందితో ‘చలో హైదరాబాద్’కు పిలుపునిచ్చి ఇందిరా పార్కు వద్ద ‘గౌడ మహా ధర్నా’ను నిర్వహిస్తామని హెచ్చరించారు. మార్చి మొదటి వారంలో పది లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లో ‘గౌడ్ల మహాగర్జన’ పెట్టి తమ సత్తా చాటుతామని స్పష్టం చేశారు.