కవాడిగూడ, జూన్ 18 : ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు తెగించి పోరాడిన ఉద్యమకారుల సంక్షేమం కోసం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద ‘ఉద్యమకారుల మహాగర్జన’ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన మహాగర్జనలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీలను అమలుచేయకుండా అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బడా కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ, తెలంగాణ ఉద్యమకారులపై లేకపోవడం దారుణమని పేర్కొన్నారు.
నరాల సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు ఇంటిస్థలం కేటాయించాలి. రూ.50 వేల పెన్షన్ ఇవ్వాలి. ఉద్యమకారుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ఇవ్వాలి. సంక్షేమ నిధికి రూ.10వేల కోట్లు కేటాయించాలి. తెలంగాణ ఆవిర్భావ, గణతంత్ర దినోత్సవాలకు ఉద్యమకారులను ప్రత్యేకంగా ఆహ్వానించాలి’ అని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడాలని, లేకుంటే ఉద్యమకారులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉద్యమకారుడు మోతె శోభన్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు గుజ కృష్ణ, ఉద్యమకారుల వేదిక వైస్ చైర్మన్ శంకర్‌గౌడ్, పెద్దసంఖ్యలో ఉద్యమకారులు పాల్గొన్నారు.