జగిత్యాల కలెక్టరేట్, డిసెంబర్ 4 : వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పోషణ మరచి, వారి ఆస్తిని ఇవ్వాలంటూ వేధింపులకు గురిచేసిన కొడుకుకు నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ జగిత్యాల ఫస్ట్ అడిషనల్ జేఎఫ్‌సీఎం మెజిస్ట్రేట్ శ్రీనిజ కోహికార్ గురువారం తీర్పునిచ్చారు. జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ వివరాల ప్రకారం..
జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన మండలోజు సత్యవతి-బ్రహ్మానందం కొడుకు రమేశ్ వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులు చూడకుండా, వారి పేరిట ఉన్న ఇల్లును తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని కొద్దిరోజులుగా వేధిస్తున్నాడు. రమేశ్ తీరుపై తల్లి సత్యవతి గతంలో జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మెజిస్ట్రేట్.. తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న రమేశ్‌కు నెల రోజుల జైలు, 500 జరిమానా విధించారు.
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఏసీబీ ఈనెల 3 నుంచి 9వరకు ‘అవినీతి నిరోధక వారోత్సవాలు’ నిర్వహిస్తున్నది. ఈమేరకు అవినీతిపై అవగాహన కల్పించడానికి, ఫిర్యాదులను సులభతరం చేయడానికి క్యూఆర్ కోడ్ వ్యవస్థను ఏసీబీ డీజీ చారుసిన్హా గురువారం ప్రారంభించి మాట్లాడారు. మారుమూల ప్రాంతాల ప్రజలు అవినీతి అధికారులపై మధ్యవర్తులు లేకుండా ఫిర్యాదు చేసే వ్యవస్థను రూపొందించామని తెలిపారు.