జగిత్యాల అర్బన్, జనవరి 20: జగిత్యాల టౌన్ మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించింది. మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై ఆం దోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శుక్రవారం జగిత్యా ల మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇందులో మాస్టర్‌ప్లాన్ ముసాయిదాను రద్దుచేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ముసాయిదా రూపకల్పనకు ప్రత్యేక కమిటీని ఏ ర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో ఎమ్మె ల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల వైఖరిని కడిగిపారేశారు. గతంలో అసంబద్ధ నిర్ణయాలతో జగిత్యా ల ప్రజలను ఆగం చేసిన వారే ఇప్పుడు ఆందోళనకు దిగ డం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. అప్పటి ఎమ్మె ల్యే జీవన్‌రెడ్డి హయాంలో పట్టణం అస్తవ్యస్థంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయనే ఊరూ రు తిరిగి ప్రజలను రెచ్చగొట్టారని విమర్శించారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని నూతన ముసాయిదాను రూపొందిస్తామని స్పష్టం చేశారు. కాగా, మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు పట్ల జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామస్థులు, రైతులు, బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
కామారెడ్డి ముసాయిదా వెనక్కి
విద్యానగర్, జనవరి 20: కామారెడ్డి టౌన్ మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానించింది. శుక్రవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం చైర్పర్సన్ జాహ్నవి మీడియాతో మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్‌పై 45 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై అపోహలను తొలగించడం కోసమే దాన్ని రద్దు చేశామని అన్నారు. దీంతోపాటు సవరించిన మాస్టర్ ప్లాన్ ముసాయిదాను ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు.. రైతులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రైతులకు నష్టం కలిగించేలా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.