జగిత్యాల, జూన్ 5 (నమస్తే తెలంగాణ): జగిత్యాల జిల్లా మామిడికి మరోసారి దేశవ్యాప్త గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జగిత్యాల మామిడి పండ్ల ప్రదర్శనతోపాటు విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లాలో దాదాపు 30 వేల హెక్టార్లలో వివిధ రకాల మామిడి తోటలు సాగుచేస్తున్నారు. కాగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం జగిత్యాల మామిడి పండ్ల మాధుర్యాన్ని దేశవిదేశాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకున్నది. ఆ చర్యలో భాగంగా జగిత్యాల బ్రాండ్ పేరిట మామిడిని దేశ విదేశాలకు ఎగుమతి చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
కేసీఆర్ హయాంలో తీసుకున్న చర్యల నేపథ్యంలో జగిత్యాల ప్రాంత మామిడి పండ్లు గల్ఫ్‌తోపాటు ఇతర దేశాలకు ఎగుమతి కావడం ఆరంభమైంది. కాగా, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాలకు చెందిన బంగినిపల్లి, కేసర్, హిమావత్, అల్పోన్సో రకాలకు చెందిన మామిడిపండ్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మూడు రోజులపాటు ప్రదర్శించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో కలిసి ఢిల్లీలోని అంతర్జాతీయ పండ్ల మార్కెట్లో జగిత్యాల మామిడి ప్రదర్శనను చేపట్టినట్టు ధుని ఎక్సిమ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి అనిల్‌కుమార్ తెలిపారు.