హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ఈ నెల 31న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సాగునీటి ప్రాజెక్టులపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగృతి ఓ ప్రకటనలో తెలిపింది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ అసత్య ప్రచారాలను పటాపంచలు చేయడానికి ప్రముఖులతో చర్చించనున్నట్టు తెలిపింది. సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేయనున్నారు. మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, సాగునీటిరంగ నిపుణులు, విశ్రాంత ఇంజినీర్లు హాజరుకానున్నట్టు పేర్కొన్నది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా, కేసీఆర్ నిర్మించిన కీలక ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేస్తున్నదని జాగృతి పేర్కొన్నది. కాళేశ్వరంపై ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని సమావేశం ద్వారా తిప్పికొడతామని స్పష్టంచేసింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేసింది. ఈ అంశాలపై రౌండ్‌టేబుల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి, తీర్మానాలను ఆమోదిస్తామని తెలిపింది. కేసీఆర్ ప్రారంభించారనే అక్కసుతోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని జాగృతి పేర్కొన్నది.