జగిత్యాల కలెక్టరేట్, ఆగస్టు 26: ఎంసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. జగిత్యాల టౌన్ సీఐ కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగలిపేటకు చెందిన ఎల్లాల ఆకాశ్ (19) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎంసెట్ పరీక్ష రాశాడు. శుక్రవారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఆకాశ్ టీఎస్ 02 ఈడీ 6052 నంబరు గల ద్విచక్ర వాహనంపై జగిత్యాలకు చేరుకున్నాడు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో జగిత్యాల-నిజామాబాద్ రహదారిపై జగిత్యాల శివారులోని హస్నాబాద్ బస్టాప్ వద్ద జగిత్యాల వైపు వస్తున్న ఆర్టీసీ బస్ ఆకాశ్ బైక్ను ఎదురుగా ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలై ఆకాశ్ అక్కడికక్కడే మృతిచెందాడు.