హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఏ అధికారిక హోదా లేని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏకంగా సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చాంబర్లో కూర్చొని సమీక్షలు నిర్వహించడం వివాదాస్పదమైంది. మంగళవారం ఆయన సంగారెడ్డి జిల్లాకు చెందిన సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీల అధికారులు, ప్రజారోగ్య విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులందరినీ మంత్రి శ్రీధర్‌బాబు చాంబర్‌లోని సమీక్షాసమావేశాలు నిర్వహించే మీటింగ్ హాల్లో కూర్చోవాలని సూచించారు. దీంతో అధికారులంతా అక్కడకు చేరుకోగా, జగ్గారెడ్డి వచ్చి సమీక్ష నిర్వహించారు. రెండు మున్సిపాలిటీల్లో ఉన్న పలు అంశాలపై మంత్రి స్థాయి ల్లో జగ్గారెడ్డి ఆదేశాలు ఇచ్చారు. అధికారులు కూడా మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ను రాసుకున్నారు. సదాశివపేట మున్సిపాలిటీలో నీటి సమస్యపై చర్చించారు. భగీరథ వాటర్ ఫిల్టర్ పనిచేయడంలేదని, ఏటిగడ్డ సంఘం వద్ద ఫిల్టర్‌బెడ్, సదాశివపేటలో ఇంటేక్వెల్ ఏర్పాటుచేయాలని సమావేశంలో నిర్ణయించారు.
దీంతోపాటు సింగూరు నుంచి నేరుగా నీటిని తరలించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను జగ్గారెడ్డి ఆదేశించడం.. వారు తలూపడం గమనార్హం. రెండు గంటలకుపైగా సమీక్షా సమావేశం జరిగింది. దీనికి సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ నేతలు, ఆ జిల్లా మీడియా ప్రతినిధులు హాజరుకావడం గమనార్హం. జగ్గారెడ్డి ఏ హోదాలో సచివాలయంలో సమీక్ష నిర్వహించారన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. సచివాలయంలో, శాసనసభ ఆవరణలో మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైనా ప్రెస్‌మీట్ పెట్టాలంటే అనుమతులు పొందాలి. సచివాలయం లోపల మీటింగ్ పెట్టాలంటే సీఎం లేదా సీఎస్ లేదా సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి తీసుకోవాలి. మాజీ ఎమ్మెల్యేలు గతంలో మంత్రుల చాంబర్లో సమావేశాలు పెట్టిన దాఖలాలే లేవు. ఇలా పెట్టేందుకు సచివాలయంలోని ఏ నిబంధన కూడా ఒప్పుకోదు. కానీ, రేవంత్‌రెడ్డి సర్కారులో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు మినహాయింపు ఇచ్చినట్టున్నారని, సచివాలయాన్ని మరో గాంధీభవన్‌లా మార్చేశారని సీనియర్ ఐఏఎస్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.