Jagga Reddy | హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో చెప్పేందుకు సభలు, సమావేశాల్లో కొందరు మర్చిపోవడం చర్చనీయాంశంగా మారింది. పుష్ప-2 ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం… అని ఆగిపోయారు. రేవంత్రెడ్డి అని చెప్పలేదు. తెలంగాణ సీఎం ఎవరో కూడా జనాలకు తెలియడం లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేశా రు. పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయించారంటూ కూడా నెటిజన్లు కామెంట్లు చేశారు. జనవరి 5న హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో రేవంత్ పాల్గొన్నారు. ఆయన సభా ప్రాంగణంలోకి రాగానే వ్యా ఖ్యాతగా వ్యవహరించిన సినీనటుడు బాలాదిత్య తెలంగాణ ముఖ్యమంత్రి, గౌరవనీయులు, శ్రీ కిరణ్కుమార్ గారు అని సంబోధించి సవరించుకున్నారు.
జగ్గారెడ్డికి కూడా తెల్వదా?
గాంధీభవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తడబడ్డారు. మన ముఖ్యమంత్రి కిరణ్కుమార్.. అని చెప్పారు. అక్కడున్న విలేకరులు ఘొల్లున నవ్వడంతో వెంటనే తేరుకొని సవరించుకున్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలపైనా సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ జరుగుతున్నది. ఆఖరికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్కు కూడా సీఎం ఎవరో తెల్వదా? అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.