Jagga Reddy | సంగారెడ్డి, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రజలను భయాందోళలనకు గురిచేస్తున్న హైడ్రా సంగారెడ్డి నియోజకవర్గం జోలికి రావొద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే టీ జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరికలు జారీ చేశారు. హైడ్రా పేరుతో ప్రజలను అనవసరమైన భయాందోళలనకు గురిచేయొద్దని సూచించారు. కూల్చివేతల పేరిట అధికారులు తన నియోజకవర్గంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రా ఔటర్ రింగ్‌రోడ్డు లోపల మాత్రమే చర్యలు చేపడుతుందని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.
రింగ్‌రోడ్డు వెలుపలి వైపు హైడ్రా యాక్షన్ ఉండదని సీఎం చెప్పడం జరిగిందని పేర్కొన్నారు. సీఎం మాటలను పక్కన పెట్టి హైడ్రా అధికారులు అత్యుత్సాహంతో చర్యలను పూనుకోవద్దని అన్నారు. సంగారెడ్డి నియోజక వర్గంలో హైడ్రా పేరుతో కూల్చివేతలు ఉంటాయని ప్రచారం జరుగుతుందని, దీంతో ప్రజలు ఆందోళనలకు గురవుతున్నట్టు పేర్కొన్నారు. సీఎం చెప్పినట్టుగా ఔటర్ రింగ్‌రోడ్డుకు బయట ఉన్న సంగారెడ్డిలో ఎలాంటి కూల్చివేతలు లేకుండా చూడాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు సూచించారు. ఒకవేళ ఈ నియోజకవర్గంలో హైడ్రా ఏమైనా చర్యలు తీసుకోవాలనుకుంటే ముందుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.