సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 19: ‘దేశంలో మోదీ అరాచకాలకు హద్దే లేకుండా పోయింది. ఆయన పాలనలో దేశ ప్రజలంతా విసిగిపోయారు. అందుకే మోదీని ఎదుర్కొనే నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అది ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని అన్ని రాష్ర్టాల ప్రజలు నమ్ముతుండ్రు’ అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటకు చెందిన 34వ వార్డు కౌన్సిలర్ మడిపల్లి విక్రమ్ (కాంగ్రెస్)తోపాటు సుమారు 250 మంది నాయకులు, కార్యకర్తలు ఆదివారం సూర్యాపేటలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా ఆత్మకూర్ (ఎస్) మండలానికి చెందిన పాత సూర్యాపేట, కందగట్ల గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 200 మంది గులాబీ కండువాలు కప్పుకొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపే సరైన నాయకత్వం లేక ఆ పార్టీ లీడర్లు, శ్రేణులు అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. రాహుల్‌గాంధీ మాత్రం ప్రధాని మోదీకి ప్రచార కార్యదర్శిగా మారారని ఆరోపించారు. ప్రధాని మోదీ దేశ సంపదను కొంత మంది కార్పొరేట్ శక్తులకు తాకట్టుపెడుతూ పేదలను మరింత పేదరికంలోకి నెట్టే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మోదీని ఎదుర్కొనే దమ్ము ఒక్క కేసీఆర్‌కు మాత్రమే ఉన్నదని, ఇదే విషయాన్ని దేశ ప్రజలంతా నమ్ముతున్నారని చెప్పారు. అందుకే అన్ని రాష్ర్టాల ప్రజలు సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని, ఇక్కడి అభివృద్ధి, సంక్షేమ పాలన తమకూ కావాలని వారు కోరుకుంటున్నారని తెలిపారు.
తెలంగాణ అమ్మాయిని పక్క రాష్ట్రం అబ్బాయి పెండ్లి చేసుకుంటే కల్యాణలక్ష్మి చెక్కు వచ్చిందని, అక్కడి అమ్మాయిని తెలంగాణకు ఇస్తే కల్యాణలక్మి రాలేదని చెప్పారు. పక్క రాష్ట్రంలో కరెంట్ లేక మోటర్లు పోయక పొలాలు ఎండిపోతుంటే.. తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్తుతో మోటర్లు నిండుగా పోస్తున్నాయని, వ్యవసాయం పచ్చగా ఉన్నదని తెలిపారు. అందుకే తెలంగాణ మాదిరి పాలన తమకూ కావాలని, లేదంటే తమను తెలంగాణలో కలుపాలని సరిహద్దు గ్రామాల ప్రజలు వేడుకుంటున్నట్టు అక్కడి బీజేపీ ఎమ్మెల్యేలే తమ సమావేశాల్లో వివరిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.