హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో ఆయన శుక్రవారం సాయంత్రం తిరుమలకు వెళ్లి శనివారం స్వామివారిని దర్శించుకోవాలని తొలుత అనుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగుతామని ఇటు హిందూ సంఘాలతోపాటు పలువురు రాజకీయ నాయకులు ప్రకటించడంతో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తాడేపల్లి నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ‘నా తండ్రి వైఎస్సార్ అనేక సార్లు తిరుమలను దర్శించుకున్నారు. సీఎంగా నేను 5 సార్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించాను. నా మతమేందో ప్రజలందరికీ తెలుసు. నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదివితే తప్పేముంది. బయటకు పోతే హిందూత్వాన్ని, ముస్లిం, సికు మతాలను గౌరవిస్తా.. అనుసరిస్తా. తిరుమలకు వస్తానంటే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం శోచనీయం. నా మతం మానవత్వం. డిక్లరేషన్‌లో రాసుకుంటే రాసుకోండి’ అని స్పష్టం చేశారు.
డిక్లరేషన్‌పై సంతకం తప్పనిసరి ; అన్యమతస్థుల కోసం టీటీడీ కీలక నిర్ణయం
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకున్నది. స్వామివారి దర్శనానికి వచ్చే హిందూయేతరులు పాటించాల్సిన నిబంధనల బోర్డులను ప్రధాన వీధుల్లో ఏర్పాటు చేసింది. కానీ, కొన్ని గంటల్లోనే వాటిని తొలగించింది. అన్యమతస్థులు ఎవరైనా స్వామివారి దర్శనం కోసం వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పష్టంచేశారు. తిరుమలను హిందూయేతరులు సందర్శించినపుడు డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఎప్పటి నుంచో ఉన్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. జగన్‌ను తిరుమలకు వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదని, ర్యాలీలు, జన సమీకరణలు చేయొద్దని మాత్రమే చెప్పినట్టు వివరించారు. కాగా, తిరుమల లడ్డూ విషయమై నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించాల్సిన అవసరం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.