Jagadsih Reddy | నల్లగొండ : కృష్ణా జలాల సాధన కోసం దక్షిణ తెలంగాణ దద్దరిల్లేలా నల్లగొండలో బహిరంగ సభ నిర్వహిస్తామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నె 13న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను జగదీశ్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బహిరంగ సభకు కేసీఆర్ స్వయంగా హాజరై కాంగ్రెస్ నిర్వాకాన్ని ఎండగడుతారని తెలిపారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నాటకాలాడుతుందన్నారు. రేవంత్ రెడ్డి ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి. కేసీఆర్ గుర్తులు చెరిపేస్తాం అంటున్న రేవంత్ ఎంతటి నీచుడో అర్థం అవుతుందన్నారు. నిజంగానే ఇవాళ కేసీఆర్ గుర్తులు మాయమవుతున్నాయి. 24 గంటల కరెంట్ కేసీఆర్ గుర్తు.. అది మాయమైంది. రైతుబంధు డబ్బులు కేసీఆర్ గుర్తు.. అది మాయమైంది. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడుతాం అని రైతులను కాంగ్రెస్ నాయకులు అవమానించారని జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇలాంటి దొంగల చేతికి ఇవాళ తెలంగాణ వెళ్లింది. కృష్ణా ప్రాజెక్టులను తిరిగి రాష్ట్ర పరిధిలోకి తీసుకురాకపోతే కాంగ్రెస్ నాయకులను ప్రజలు గ్రామాల్లో తిరగనివ్వరని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.
బహిరంగ సభా ఏర్పాట్లను పరిశీలించిన వారిలో గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, జీవన్ రెడ్డి, సభ సమన్వయకర్త రవీందర్ సింగ్, డాక్టర్ చెరుకు సుధాకర్, పల్లె రవికుమార్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, తండు సైదులు గౌడ్, దేవేందర్ ఉన్నారు.