హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)కి నష్టం వాటిల్లింది కాంగ్రెస్, తెలుగుదేశం హయాంలోనే అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని విస్మరించి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పైనా, మాజీమంత్రి హరీశ్‌రావుపైనా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక నాయకుడు స్వయంగా టెక్నికల్ సర్వే చేయడం బహుశా దేశంలో ఇదే మొదటి సారి అని ఎద్దేవా చేశారు. కెప్టెన్ హెలికాప్టర్ నడిపించారని, వాటర్‌లో నీళ్లు కలిపే మంత్రి సర్వే చేశారని దుయ్యబట్టారు. నీటి ప్రాజెక్టుల విషయంలో ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పరిజ్ఞానం లేదని, ఆయనకు నీళ్లన్నా, నీటి ప్రాజెక్టుల సబ్జెక్టు అన్నా భయమని దుయ్యబట్టారు.
వాస్తవానికి తెలంగాణ రాక ముందు, 2013లో ఉమ్మడి ఏపీలోనే కృష్ణా నదీ జలాల కేటాయింపులు జరిగాయని, వాటిలో ఆనాడు తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు కేటాయించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాటి కేటాయింపులపై కేసీఆర్, హరీశ్‌రావు సంతకం చేశారని చెప్తున్న రేవంత్‌రెడ్డి చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ర్టానికి జరుగుతున్న నష్టాన్ని అరికట్టేందుకు కృష్ణా జలాల వాటాపై కమిషన్ వేయించారని గుర్తుచేశారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో మృతి చెందిన వారి శవాలను కూడా నేటికీ బయటకు తీయలేకపోవడం సిగ్గుచేటని అన్నారు. కమీషన్లు, వాటాల కోసమే ఎస్ఎల్బీసీ పనులు చేపట్టారని ఆరోపించారు.
ఇద్దరు మంత్రులు ఉన్నా..
నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా ఉదయ సముద్రంలో మాత్రం నీళ్లు లేకుండా పోయాయని జగదీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డికి తన శక్తికి మించి పదవి వచ్చిందని ఎద్దేవాచేశారు. ఆయన పాత గురువు చంద్రబాబు, కొత్త గురువు కాంగ్రెస్ నిర్వాకంతోనే పాలమూరుకు నీళ్లు రాలేదని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో బీఫామ్‌ల కోసం, తెలంగాణలో పదవి కాపాడుకునేందుకు మోదీతో రేవంత్ మిలాఖత్ అయ్యారని దుయ్యబట్టారు. చేవెళ్లలో బస్సు ప్రమాదం జరిగితే సీఎం హోదాలో రేవంత్ ఎందుకు సందర్శించలే. ఈ విషయంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
గాలిలో పరిపాలన, గాలిమోటర్లలో సీఎం, మంత్రులు
పరిపాలనను గాలికొదిలి గాలి మోటార్లు ఎక్కి తిరుగుతున్న సీఎం, మంత్రుల వైఖరిని జగదీశ్‌రెడ్డి తప్పుబట్టారు. సీఎం ఢిల్లీలో ఉంటే, మంత్రులు జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా పాలనను పక్కకు నెట్టి, ఎంత సేపూ ముఖ్యమంత్రి, మంత్రులు పంచాయితీలు పెట్టుకోవడం తప్ప పరిపాలన చేయడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నేరాల శాతం 50కి పెరిగిందని దుయ్యబట్టారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు భిక్షమయ్యగౌడ్, భూపాల్‌రెడ్డి, రవీంద్రకుమార్ పాల్గొన్నారు.