Jagadish Reddy | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు చాలా దారుణంగా మారాయని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకవైపు, బీఆర్ఎస్ కార్యకర్తలు మరో వైపు ఉన్నారని అన్నారు. ఇది చూస్తుంటే ఎన్నికల కమిషన్ మీద ఉన్న నమ్మకం పోతుందని వ్యాఖ్యానించారు.
నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల వేళ జిల్లాలో దారుణాలు జరుగుతున్నాయని అన్నారు. చాలా అన్యాయంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులు కూడా కాంగ్రెస్ నాయకుల గుంపులో చేరి అక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఉద్యోగులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.. కానీ అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అధికారులు, పోలీసులు కాంగ్రెస్ నాయకులతో చేతులు కలిపి.. బీఆర్ఎస్ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తుందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కడా కూడా రాజకీయ ఘర్షణలకు తావులేదని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రుల పీఏలు రోజూ పోలీసులకు ఆదేశాలిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో హోంగార్డులు కూడా జిల్లా ఎస్పీలను లెక్క చేసే పరిస్థితి లేదని వేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు గెలిచిన చోట రీకౌంటింగ్ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలచిని చోట కూడా కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు భయపడి ఫలితాలు తారుమారు చేస్తున్నారని అన్నారు. చిన్నకాపర్తిలో బీఆర్ఎస్కు వేసిన ఓట్లకు సంబంధించిన పోలింగ్ చిట్టీలు డ్రైనేజీలో ఉన్నాయని అన్నారు. బీఆర్ఎస్కు గ్రామస్థాయిలో పటిష్టమైన పట్టు ఉందని.. బీఆర్ఎస్ సైన్యం వీరోచిత పోరాటం చేస్తున్నారని తెలిపారు.రేపు రెండో విడత పోలింగ్ ఉందని.. అధికారులు చటబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. మొదటి విడత లో 45 శాతం మంది BRS బలపరిచిన సర్పంచ్ లు విజయం సాధించారని తెలిపారు. రాబోయే రోజులు అన్ని BRS వే.. ఎన్నిక ఏదైనా ఇకమీదట గెల్చేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు గూడు కట్టుకున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి పనితనం ప్రజలకు అర్థమైందని.. ఇక కాంగ్రెస్ వల్ల ఏం కాదని అర్థమైందన్నారు.
బీఆర్ఎస్ పథకాలు మినహా కాంగ్రెస్ చేసిందేమీ లేదని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. మహిళలను, రైతులను బీఆర్ఎస్కు దూరం చేసే కుట్రలో భాగంగా అమలుకాని హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని చెప్పారు. పంటల బీమా, రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని అన్నారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చిన్నకాపర్తి బ్యాలెట్ పేపర్ల విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు.