నల్లగొండ, డిసెంబర్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికల అధికారులు, పోలీసులే కాంగ్రెస్ కార్యకర్తల్లా అవతారమెత్తి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు, పోలీసులు ఒక్కటై బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తున్నా కలెక్టర్, ఎస్పీలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు రౌడీ మూకలను రప్పించి బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించడంతోపాటు కిడ్నాప్‌లకు పాల్పడ్డారని, నామినేషన్లు వేయనివ్వడం లేదని, నామినేషన్ వేసిన అభ్యర్థులను ప్రచారం చేసుకోనివ్వడంలేదని తెలిపారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు పోలీసులు, ఎన్నికల అధికారులకు ఆదేశాలిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించకుంటే జనమే తిరగబడతారని హెచ్చరించారు. తొలి విడతలో ఎన్ని అరాచకాలకు పాల్పడినా ఉమ్మడి జిల్లాలో 40శాతం స్థానాలు సాధించుకున్నామని రెండు, మూడో విడతల్లోనూ బీఆర్ఎస్ వైపే జనం ఉంటారని చెప్పారు. తొలి దఫా ఎన్నికల్లో నల్లగొండ, నకిరేకల్, సాగర్, తుంగతుర్తి, హుజూర్నగర్ నియోజక వర్గాల్లో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగినట్టు తెలిపారు. బీఆర్ఎస్ గెలిచిన ప్రాంతాల్లో రీకౌంటింగ్ పేరుతో కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటిస్తున్నారని ఆరోపించారు. చినకాపర్తిలో బీఆర్ఎస్కు ఓటువేసిన బ్యాలెట్ పేపర్లు మోరీల్లో దొరికాయంటే ఎన్నికల అధికారులు ఏ స్థాయిలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారో స్పష్టమైందని పేర్కొన్నారు.