నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు కావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే ఉప ఎన్నికలు జరుగుతాయని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నకిరేకల్, నల్లగొండ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి సోమవారం కాళోజీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించడం శుభపరిణామమని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ తీర్పు న్యాయస్థానాలపై విశ్వాసాన్ని మరింత పెంచిందని చెప్పారు. త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. హైడ్రా పేరుతో సీఎం ఆగడాలకు పాల్పడుతున్నారని, హైదరాబాద్‌లో ఇండ్లు కొనాలన్నా.. కట్టాలన్నా ప్రజలు భయపడేలా సీఎం వ్యవహారశైలి ఉందని జగదీశ్‌రెడ్డి విమర్శించారు.