గోదావరిఖని, జూలై 13 : ‘రైతాంగానికి నీళ్లు ఇవ్వడం చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును మాకు అప్పగించండి.. 3 రోజుల్లో ప్రతి ఎకరాకు సాగునీరందిస్తాం’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆదివారం ఆయన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నివాసంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రైతాంగానికి సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గోస పెడుతుందని మండిపడ్డారు.
ప్రస్తుతం కాళేశ్వరం జోన్ పరిధిలో ఉన్న ప్రాజెక్టుల్లో లక్షలాది ఎకరాలకు కావాల్సిన సాగునీరు సిద్ధంగా ఉన్నదని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు, కంపు మాటలతో కాలం వెల్లదీస్తున్నదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి, నీళ్ల మంత్రి అజ్ఞానంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉంటే రేవంత్ పాలన అప్పుల పాల్జేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.