సికింద్రాబాద్, మే 24: కేసీఆర్ హయాంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా కేసీఆర్‌ను ఓడించి తప్పుచేశాం అని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నదని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ఈసీఈ ఆడిటోరియంలో శనివారం తెలంగాణ రాష్ట్రం-నీళ్లు, నిధులు, నియామకాలు అంశంపై విద్యార్థి సంఘాలు నిర్వహించిన సెమినార్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగదీశ్‌రెడ్డి.. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లపాటు జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాల రంగాల్లో సాధించిన పురోగతిని వివరించారు. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
కాంగ్రెస్ అసత్య ప్రచారానికి బీజేపీ వంతపాడిందని మండిపడ్డారు. సీనియర్ జర్నలిస్ట్ టంకశాల అశోక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే నినాదంతోనే ఉద్యమం సాగించిందని చెప్పారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ ఎలా ఉండేది?, స్వరాష్ట్రంలో ఎలా అభివృద్ధి చెందింది? అనే విషయంపై విద్యార్థులు పరిశోధన చేసి, ప్రజలకు వివరించాలని సూచించారు. టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసిందని మండిపడ్డారు. విద్యార్థులు, మేధావులు ప్రజలకు నిజాలను తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేందర్, జర్నలిస్టు యోగి, ఓయూ అధ్యాపకులు, న్యాయవాదులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు సతీశ్, విజయ్, నాగయ్య, వెంకట్, నవీన్ పాల్గొన్నారు.