హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు హరితహారం చేపడితే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి హరిత సంహారానికి పూనుకున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. హెచ్‌సీయూ భూముల పరిరక్షణ కోసం ఆందోళన చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు జగదీశ్‌రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు భాసర్‌రావు, ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పల్లా ప్రవీణ్‌రెడ్డి, వల్లమల్ల కృష్ణ, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాస్తున్న మీడియా ప్రతినిధులు, తమ భూములు లాక్కొవడాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేస్తున్న రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా కేసులు పెట్టి హింసిస్తున్నదని మండిపడ్డారు. ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న హెచ్‌సీయూని కాపాడుకునేందుకు విద్యార్థులు ఆందోళనలు చేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రులు మంగళవారం మీడియా సమావేశంలో విద్యార్థులపై అకసు వెళ్లగకి వాళ్లను పెయిడ్ బ్యాచ్ అని అవమానించారని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులే పెయిడ్ బ్యాచ్ అని విమర్శించారు.
నాడు గురువు చంద్రబాబు హెచ్‌సీయూ భూములను తాబేదార్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే, నేడు ఆ భూములను శిష్యుడు రేవంత్‌రెడ్డి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి పోలీసులను లోపలికి రాకుండా ఆపొచ్చని, ఇది బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం అని ఆరోపించారు. హెచ్‌సీయూలో 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అయితే దొంగల్లా అర్ధరాత్రి ఎందుకు వెళ్లారని మండిపడ్డారు. హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటం రాహుల్‌గాంధీకి కనిపిస్తలేదా? అని ప్రశ్నించారు. ముడుపుల కోసమే రాహుల్‌గాంధీ మాట్లాడటం లేదని ఆరోపించారు.