‘మంత్రి సురేఖ బర్తరఫ్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం.. కానీ పీసీసీ పదవిని 50 కోట్లకు కొనుక్కున్నారని ప్రస్తుత మంత్రి ఒకరు మాట్లాడారు. కుంతియాకు 25 కోట్లు ఇచ్చారని, కేసీ వేణుగోపాల్‌కు మూటలు పంపుతు న్నారని కాంగ్రెస్ నేతలే చెప్తున్నారు. అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు గతంలో నేరుగా రేవంత్‌పై ఆరోపణలు గుప్పించారు. వారిపై చర్యలేవి? ఆ ఆరోపణలను సీఎం అంగీకరిస్తున్నట్టేనా? మహిళా మంత్రికి ఓ న్యాయం? వారికి మరో న్యాయమా?’
-జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్ అంటేనే కొట్లాటలు.. కుమ్ములాటలు.. కమీషన్లు.. భూ దందాలు.. చిల్లర పంచాయితీలు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి దెప్పిపొడిచారు. ‘వరంగల్ జిల్లా కాంట్రాక్టులు, హైదరాబాద్ భూము లు, పారిశ్రామికవేత్తలను బెదిరించి డబ్బుల వసూళ్ల వల్లే సీఎం, సురేఖ, పొంగులేటి మధ్య పంచాయితీ మొదలైంది.. వాటాల పంపకంలో తేడాలు రావడం వల్లే ఇప్పుడు పరాకాష్టకు చేరింది’ అంటూ సంచలన విమర్శలు చేశారు. వెయ్యిరోజుల కాంగ్రెస్ పాలనలో ఓ మహిళా మంత్రిని బర్తరఫ్ చేయడమే సాధించిన అతిపెద్ద ఘనత అని ఎద్దేవాచేశారు.
సీఎం, మంత్రుల మధ్య మొదలైన కొట్లాటలతో కాంగ్రెస్ సర్కార్ పతనం ప్రారంభమైందని చెప్పారు. అన్నదమ్ములను అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.‘కాంగ్రెస్ సర్కార్ చేసిన వందల కుంభకోణాలను బీఆర్ఎస్ ఆధారాలతో బయటపెట్టింది.. ఇప్పుడు కొండా సురేఖ కూతురు సుస్మిత సైతం రేవంత్ అన్నదమ్ములు, అనుయాయుల బాగోతాలను బహిర్గతం చేసింది. వారు పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని చెప్పింది. కానీ ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానమేది? లెవనెత్తిన అంశాలపై చర్చ ఏది?’ అని ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, పార్టీ నేత నంద్యాల దయాకర్రెడ్డితో కలిసి జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ పోరాటాలను ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు.

Jagadishreddy
పీసీసీ పదవిని కొనుక్కున్నారని మంత్రే చెప్పిండ్రు
‘మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ వారి పార్టీ అంతర్గత వ్యవహారం.. కానీ పీసీసీ పదవిని 50 కోట్లకు కొనుక్కున్నారని ప్రస్తుత మంత్రి మాట్లాడారు.. కుంతియాకు 25 కోట్లు ఇచ్చారని, కేసీ వేణుగోపాల్‌కు మూటలు పంపుతున్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. గతంలో అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు నేరుగా రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.. మరీ వారి సంగతేంది?’ అని జగదీశ్‌రెడ్డి నిలదీశారు. ‘వారిపై చర్యలు తీసుకోరా? అంటే ముఖ్యమంత్రి తన అవినీతిని ఒప్పుకొంటున్నారా? మహిళా మంత్రికి ఓ న్యాయం? వారికి మరో న్యాయమా?’ అని ప్రశ్నాస్ర్తాలు సంధించారు.
రెవెన్యూ మంత్రి సెటిల్మెంట్లు
భూముల రక్షణ, సులువైన రిజిస్ట్రేషన్ కోసం కేసీఆర్ ధరణిని తెచ్చారని జగదీశ్‌రెడ్డి గుర్తుచేశారు. కానీ కొందరు అవినీతి అధికారులు కాంగ్రెస్ నేతలతో ఆరోపణలు చేయించారని, చివరికి ధరణి స్థానంలో భూ భారతి తెచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ భూ భారతి పోర్టల్ భూ హారతిగా మారిందని దెప్పిపొడిచారు. కోట్ల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి హైదరాబాద్, రంగారెడ్డి చుట్టూ అధికార పార్టీ నాయకులు భూదందాలకు తెరలేపారని దుయ్యబట్టారు.
చంద్రబాబు కన్నసన్నల్లోనే పాలన
రేవంత్‌రెడ్డికి పాలన చేతగావడం లేదని జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. కృష్ణా, గోదావరి నీటిని దిగువకు వదిలిపెట్టి రాష్ట్ర రైతులకు తీ రని ద్రోహం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ‘బీటీపీఎస్, యాదాద్రిలో విద్యుత్తు ఉత్పత్తిని తగ్గించారు..కమీషన్లు రావనే సింగరేణి నుంచి బొగ్గు కొనుగోలును విస్మరించారు. అసలు తెలంగాణ ప్రభుత్వాన్ని చంద్రబాబు నడుపుతున్నారు. ఆయన దీవెనలతోనే రేవంత్‌రెడ్డి నెట్టుకొస్తున్నారు’అంటూ విరుచుకుపడ్డారు.
పొంగులేటికి ఓనమాలు తెలియవు
రాష్ట్ర అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటున్నదని పొంగులేటి చేసిన ఆరోపణలను జగదీశ్‌రెడ్డి తిప్పికొట్టారు. ఆయన మొదటిసారి ఎమ్మెల్యే, మంత్రి అయ్యారని, ఆయనకు రాజకీయ ఓనమాలు కూడా తెలియవని చురకలంటించారు. ఆయనకు పొంగు ఎక్కువ య్యే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘అసలు రేవంత్‌రెడ్డి చేసిన అ భివృద్ధి ఏంది? మేం అడ్డుకునేది ఏమున్నది? కేసీఆర్ పూర్తిచేసిన పనులకు ప్రారంభోత్సవాలు చేయడం తప్ప ఆయనకు అభివృద్ధి గురించి తెలుసా?’ అంటూ దుయ్యబట్టారు. సుస్మిత వాఖ్యల వెనుక బీఆర్ఎస్ ఉన్నదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సుస్మిత ఆరోపణల వెనుక బీఆర్ఎస్ లేదని..అవినీతి అనకొండ ఉన్నదని తనదైన శైలిలో తిప్పికొట్టారు.
సురేఖను తీసుకోం..రాజగోపాల్‌రెడ్డిని రానివ్వం..
కొండా సురేఖ బీఆర్ఎస్తో టచ్‌లో ఉన్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు జగదీశ్‌రెడ్డి స్పందించారు. అసలు ఈ విషయం చర్చలో లేదంటూనే కొండా సురేఖను పార్టీలోకి తీసుకోబోమని స్పష్టంచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీలోకి వస్తామని చెప్పినా అంగీకరించలేదని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దరఖాస్తు చేసినా చేర్చుకోబోమని తేల్చిచెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో కొందరు తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. వారిలో ఒకరిద్దరిని మినహా ఎవర్నీ తీసుకోబోమని స్పష్టంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ అమ్ముడుపోయినట్టుగా భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.