ఎల్కతుర్తి, ఏప్రిల్ 19: కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని కోరిక బీఆర్ఎస్కు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలోని బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి పొరపాటున ఓటు వేశామని, ఐదేండ్లు భరించాలని ప్రజలే బాధపడుతున్నట్టు తెలిపారు.
ఈ దరిద్రం పోవాలని ప్రజలే శాపనార్థాలు పెడుతున్నారంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థం చేసుకోవాలని సూచించారు. 25 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా రజతత్సోవ సభ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే, ప్రజలు మాత్రం దీన్ని కాంగ్రెస్ వ్యతిరేక సభగా మార్చుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటు వేసిన పొరపాటును సరిచేసుకోవాలంటే తప్పకుండా ఎల్కతుర్తి సభకు వెళ్లాలని, అక్కడి మట్టిని తాకాలని, కేసీఆర్ మాటలు వినాలని ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ నిర్వాకం వల్ల ఏడాదిన్నరలోనే ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దుర్మార్గపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసిన ప్రజలే ఏడాదిలో తద్దినం పెట్టాలని చూస్తున్నారని అన్నారు. కేసీఆర్ హయాంలో వచ్చిన పథకాలను నేడు ప్రజలు కోల్పోవడంతో ఈ సభకు రావడానికి ఉత్సాహం చూపుతున్నారని పేర్కొన్నారు. వారిచ్చిన హామీలు అమలు చేయడం పక్కన పెడితే, కనీసం కేసీఆర్ పథకాలను కూడా కొనసాగించలేకపోతున్నారని విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడుతున్నదని, చేతికాని, దద్దమ్మ ప్రభుత్వంలో ఎలా ఇరుక్కున్నామని ఓట్లేసిన ప్రజలే బాధపడుతున్నారని తెలిపారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ సభలు నిర్వహించిన రికార్డు బీఆర్ఎస్కు ఉన్నదని చెప్పారు. ఎక్కడా చూసినా రజతోత్సవ సభ మీదనే ప్రజలు చర్చించుకుంటున్నారని, ఈ సభ ద్వారా కేసీఆర్ ఏం చెప్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, గ్యాదరి కిశోర్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, చింతం సదానందం, చింతల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ)/డోర్నకల్ : ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ వైపే దేశమంతా చూస్తున్నదని, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు. శనివారం మహబూబాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ క్యాంపు కార్యాలయంలో, డోర్నకల్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.
గద్వాల, ఏప్రిల్ 19 : ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు దండులా కదిలిరావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాగుంట వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గులాబీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. సభకు వెళ్లే ముందు ప్రతి పల్లెలో గులాబీ జెండాను ఎగురవేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని భరోసానిచ్చారు. కాగా ఉమిత్యాల తండాకు చెందిన 20 మంది యువకులు నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
‘హాలో విద్యార్థి.. చలో వరంగల్’ పేరుతో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌ను శనివారం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, అశ్వంత్‌కుమార్ ఆవిష్కరించారు.
– హైదరాబాద్
కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 19 : ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని మాజీ మం త్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్‌లోని కోర్టు రోడ్డులో బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి పోస్టర్లను అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ రజతోత్సవ వేడుకలను పండుగలా నిర్వహిస్తున్నామని, కరీంనగర్ నియోజకవర్గం నుంచి వచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
ఎల్కతుర్తి, ఏప్రిల్ 19: దేశంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో జాతీయ పార్టీలు పూర్తిగా విఫలమైనట్టు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ఆరోపించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి శనివారం ఆయన పరిశీలించి మాట్లాడా రు. దేశంలో ఓ ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ ఫెడరల్ స్ఫూర్తిని ప్రభావితం చేస్తున్నదని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కలను సాకారం చేయడమే కాకుండా సాధించిన రాష్ర్టాన్ని కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని కొనియాడారు.