ఈ కర్కశ కాంగ్రెస్ పీడను వదిలించాలంటే గులాబీ జెండాతోనే, బీఆర్ఎస్తోనే సాధ్యమని ప్రజలు గుర్తించారు. ఈ 15 నెలల్లో ఎక్కడికి పోయినా బీఆర్ఎస్ మళ్లీ రావాలని, కేసీఆరే కావాలని కోరుకుంటున్నరు. అసెంబ్లీలో ఓడిండ్రు.. పార్లమెంట్లో ఒక్క సీటు గెల్వలేదు. ఇగ వీళ్ల పని అయిపోయింది.. పార్టీ మూతపడుతదని చాలా మంది అనుకున్నరు. కానీ ఒక ఫీనిక్స్ పక్షిలా మళ్లీ అద్భుత పోరాట పటిమతో తిరిగి అధికారంలోకి వస్తం.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సూర్యాపేట, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఊరికి ఒక్కరున్ననాడే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణను కాపాడుకున్నరని, ఇవ్వాళ జనాలను కాపాడుకోవడం ఎలాగో ఆయనకు తెలుసని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. గురువారం సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. ‘తెలంగాణ ఉద్యమం కోసం 2001లో పార్టీ స్థాపించిన నాడు నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు, తెలంగాణ ప్రాంతంలోని వారి తొత్తులు ‘జై తెలంగాణ’ అంటే అవహేళన చేశారు.
ఆనాడు చాలా చోట్ల ఊరికి ఒక్కరే ‘జై తెలంగాణ’ అన్నవారు ఉంటేనే తల్లి కోడి పిల్లలను కాకుల నుంచి, గద్దల నుంచి ఎట్లా రెక్కల కింద పెట్టి కాపాడుకుంటుందో కేసీఆర్ ఆ పద్ధతుల్లో ఉద్యమకారులను కాపాడుకొని ఉద్యమాన్ని నడిపించారు. నేడు మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి కొత్త పథకాలు ఇవ్వకున్నా కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాటిని కొనసాగించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంటే ప్రజలను కాపాడుకోవడం ఎలాగో కేసీఆర్‌కు బాగా తెలుసు.
ఆనాడు కేసీఆర్ వెంట నిలబడితే మాకేమన్నా అవుతుందేమోనని లాగులు తడుపుకొన్న నాయకులు నేడు అవాకులు చవాకులు పేలుతున్నారు. తెలంగాణను అనేక రంగాల్లో దేశంలో ముందు నిలిపింది కేసీఆర్. గులాబీ జెండా.. కేసీఆర్ వేర్వేరు కాదు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ఉరికనే చేయలేదు.. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాడు లక్ష రూపాయలు లేని తలసరి ఆదాయాన్ని రూ.3 లక్షలకు తీసుకువచ్చారు. ఆరేండ్లలో లక్షల ఉద్యోగాలు వచ్చేలా కేటీఆర్ పని చేశారు.
రైతుబంధు, రైతుబీమాను దేశం మొత్తం కోరుకున్నది. గుజరాత్లో రాని కరెంట్‌ను కేసీఆర్ ఇస్తుండు.. నువ్వెందుకు ఇవ్వడం లేదని మోదీపై కొట్లాటకు రోడ్లెక్కిండ్రు. నేడు దేశంలో ఆకలిచావులు విపరీతంగా ఉన్నాయి. కానీ, తెలంగాణలో మూడు పూటలా కడుపునిండా అన్నం తినేలా కేసీఆర్ పాలన చేపట్టారు. అలాంటి కేసీఆర్ నాయకత్వంలో మనమంతా పని చేస్తున్నందుకు గర్వపడాలి. రజతోత్సవ వేడుకలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యకర్తలు పెద్దఎత్తున కదం తొక్కి వరంగల్ సభకు వెళ్లి విజయవంతం చేయాలి’ అని పిలుపునిచ్చారు.
14 ఏండ్లు నిర్విరామంగా ఉద్యమం నడిపి, దేశంలోని అన్ని పార్టీలను ఒప్పించి, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ తెలంగాణ జాతిపితేనని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ స్పష్టం చేశారు. ‘ఈ మధ్య ఒకడు.. ‘కేసీఆర్ జాతిపిత అంట’ అని విమర్శించిండు. అసెంబ్లీలో బట్టలూడదీసి కొడతానని నోటికొచ్చింది మాట్లాడుతుండు. 2009లో మిమ్మల్ని బట్టలూడదీసి కొట్టేంత పరిస్థితి వచ్చింది నిజం కాదా?’ అని ప్రశ్నించారు.
నమ్మి ఓట్లేసి మోసపోతున్న జనం కష్టాలు తీరాలంటే గొంతెత్తి మాట్లాడే కేసీఆర్ జనంలోకి రావాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పేర్కొన్నారు. ‘కేసీఆర్ వేసే ప్రశ్నలకు ప్రభుత్వం దిగొస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. మీరు ఎండిన పొలాల్లోకి రావాలి. మీకు సైన్యంగా మేమంతా ఉంటాం’ అని పేర్కొన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఇతర రాజకీయ పార్టీలు అధికారం కోసం ఎగబెడితే కేసీఆర్ మాత్రమే జనంకోసం ఆలోచించే ఏకైక నాయకుడని తెలిపారు. సమావేశంలో ఉమ్మ డి నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నలమోతు భాస్కర్‌రావు, నోముల భగత్, బూడిద భిక్షమయ్యగౌడ్, తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సోమ భరత్, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, చెరుకు సుధాకర్, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, దూదిమెట్ల బాలరాజుయాదవ్, రాజీవ్‌సాగర్, వై వెంకటేశ్వర్లు, కంచర్ల కృష్ణారెడ్డి, గుజ్జ దీపిక, పెరుమాళ్ల అన్నపూర్ణ, నిమ్మల శ్రీనివాస్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ.. సూర్యాపేటకు కేటీఆర్ వస్తే బ్రహ్మాండంగా భారీ ర్యాలీ జరిగిందని పేర్కొన్నారు. ‘పులి కడుపున పులే పుడుతుందని కేసీఆర్ తనయుడిగా కేటీఆర్ నిరూపించుకున్నారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఐటీకి వన్నె తెచ్చారు. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా ముందుకు తీసుకెళ్లే దమ్ము బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉంది. వరంగల్ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి’ అని తెలిపారు.